తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Sunday, July 31, 2011

మనిషి తలకు ఉన్న విలువ ఏమిటి? (ఒక చిన్న కథ)

ఒకసారి అశోకుడు,తన మంత్రి ఒక వీధిలో నడుస్తున్నారు.

దారిలో ఒక బౌద్ధసన్యాసి ఎదురు రాగా అశొకుడు తన కిరీటం తీసి పక్కన పెట్టి తన తలను ఆ సన్యాసి పాదాలపై ఉంచి నమస్కరించాడు. ఈ దృశ్యం చూసి మంత్రి ఒక చక్రవర్తి ఒక సామాన్య సన్యాసికి అంత గౌరవం ఇవ్వడం అనవసరం అని భావించాడు. ఈ విషయాన్ని అశోకుడు గమనించాడు.

తర్వాత ఆ మంత్రికి పాఠం నేర్పదలచి తన మంత్రి తో ఒక గొర్రెతల, ఒక ఎద్దు తల, ఒక మనిషితల తెమ్మని చెప్పాడు. మంత్రి అలాగే తెచ్చాడు. తర్వాత వాటిని బజారులో అమ్ముకొని రమ్మని మంత్రిని పంపాడు. మేక,ఎద్దు తలలను అమ్మగలిగాడు కానీ మనిషి తలను ఎంత ప్రయత్నించినా అమ్మలేకపోయాడు. అదే విషయం అశోకునికి చెప్పగా మనిషి తలను ఉచితంగా ఐనా ఎవరికైనా ఇచ్చి రమ్మన్నాడు. కాని ఏ ఒక్కరూ మనిషితలను తీసుకోవడానికి కాని, కనీసం చూడడానికి కూడా ఇష్టపడలేదు.

మంత్రి తిరిగి సభకు రాగా అశొకుడు అన్నాడు " ఆ రోజు నా తలను ఆ సన్యాసి పాదాలపై పెట్టగా నువు ఏంటి ఇలా చేశారు రాజు అనుకున్నావు. ఇప్పుడే చూసావు కాదా మనిషి తల యొక్క విలువ. బ్రతికి ఉన్నంత వరకే మనిషి తలకు విలువ.చనిపోయిన తర్వాత ఎద్దు,మేక లాంటి జంతువుల తలలకైనా విలువ ఉంటుంది కాని అసలు మనిషి తలను అసలు చూడడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు,ఇక విలువ సంగతి ఏం చెప్పాలి".

Sunday, July 3, 2011

సుప్రభాతము "కౌసల్యా సుప్రజా రామా" అని మొదలవడములో ఏదైనా అంతారార్థము ఉందా?

చాలా రోజుల తర్వాత బ్లాగు లోకము లోకి మళ్ళీ ప్రవేశిస్తున్నాను.


విశ్వామిత్రుడు రాముడిని నిద్రలేపుతూ

కౌసల్యా సుప్రజా రామా! పూర్వాసంధ్యా ప్రవర్తతే !
ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం!

అంటాడు.

మన తెలుగు లోగిళ్లు "కౌసల్యా సుప్రజా రామా" అను సుప్రభాతము తో మేల్కొంటాయి. అసలు సుప్రభాతము ఈ శ్లోకము తోనే ఎందుకు మొదలైంది అని ఆలోచిస్తే ఇందులో మనకు ఒకటి అర్థమవుతుంది.

"కౌసల్యా సుప్రజా రామా!" అంటే ఇక్కడ రాముడు అనగా మేలుకోబోయే వ్యక్తి. అతడిని మేలుకొలపాలి. గాఢముగా నిద్రపోతున్న వ్యక్తిని ఉన్నట్టుండి మేల్కొలపడము ప్రమాదకరము. ఎటువంటి వ్యక్తి అయినా తన తల్లి పేరు విన్నంతనే తన దృష్టిని అటువైపు త్రిప్పుతాడు. అందువల్ల మొదట తల్లి పేరు పలికినారు. అంతేకాక ప్రత్యక్ష దైవమైన తల్లిని మొదట అతడికి గుర్తు చేస్తూ తర్వాత ఆ మేల్కోబోయే వ్యక్తి పేరు("రామా!") పిలుస్తున్నాము. సుప్రజా అంటే మంచిబిడ్డవు అని అర్థము.


తర్వాత మాత్రమే"పూర్వాసంధ్యా ప్రవర్తతే" అంటే తెల్లవారుతోంది నాయనా అంటున్నారు. అంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదు, ఉదయించడానికి తయారుగా ఉన్నాడు. తెల్లవారుఝామునే లేవడం ఎంతో మంచిది అని మన అందరికీ తెలుసు.అందుకే ఆ సమయానికే ఇక్కడ మేల్కొల్పడం జరుగుతోంది.


"ఉత్తిష్ఠ నరశార్దూలా" అంటే ఓ మనుషులలో పులి లాంటి వాడా లెమ్ము అంటున్నారు. మనము చూస్తూనే ఉంటాము పిల్లలను లేపేటప్పుడు లేవరా "దున్నపోతా! బారెడు పొద్దెక్కినా ఇంకా పడుకొనే ఉన్నావు. పక్కింటి అబ్బాయి చూడు మంచి ర్యాంకు తెచ్చుకొన్నాడు, నువ్వూ ఉన్నావు పనికిరాని వెధవవు తినేకి,నిద్రపోయేకి ఎప్పుడూ తయారుగా ఉంటావు" అంటూ తిడుతూ లేపుతుంటారు.అందువలన లేచేటప్పుడే పిల్లలు ఒక విధమైన బాధతో లేస్తుంటారు. అలాకాకుండా తన శక్తిసామర్థ్యాలను గుర్తు చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ మేల్కొల్పితే ఎంత ఆనందముగా,ఉత్సాహము తో మేల్కొంటారు. తర్వాత ఆ రోజు ఎంత ఉత్సాహముగా తమ పనులను చేసుకొంటారు. అందుకే ఈ విధంగా మేల్కొల్పాలని మనకు నేర్పుతున్నారు.


"కర్తవ్యం దైవమాహ్నికం" అంటే నీకు దైవం చే విధించబడిన అంటే నీవు చేయవలసిన పనులు (చదువుకోవడం కావచ్చు లేక ఉద్యోగం కావచ్చు లేక మరే వ్యాపారమో,సేద్యమో ఏదైనా కావచ్చు)చేయవలసి ఉంది అని గుర్తుచేస్తున్నారు.అందుకని తెల్లవారుఝామునే లెమ్ము నాయనా అంటూ ఒక పాజిటివ్ దృక్పథాన్ని కల్గిస్తూ మేల్కొల్పడం చేయాలి.

రాముడిని నిమిత్తముగా చేస్కొని సకల జీవరాశులను ఇలా మేల్కొలుపుతున్నారన్నమాట.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు