తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, April 10, 2009

బ్లాగుల వాతావరణాన్ని బాగుచేయడానికి ప్రయత్నిద్దాం.ఏమంటారు?

ఈ మధ్య బ్లాగులలో తీవ్రమైన మాటల యుద్ధాలు, సవాల్లు-ప్రతి సవాల్లు చాలా తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. బ్లాగుల వాతావరణం ఇలాంటి ధూళిమేఘాలతో కలుషితమవుతోంది. సీనియర్ బ్లాగర్లు, జూనియర్ బ్లాగర్లు, మహిళా బ్లాగర్లు అంటూ ఏవేవో పదాలు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పదాలే మన మధ్య లేనిపోని అహాలు(ego), ఎక్కువతక్కువలను సృష్టిస్తున్నాయని అభిప్రాయపడుతున్నాను.

ఎప్పుడైతే మన వ్యక్తిగత అభిప్రాయాన్ని సామూహిక అభిప్రాయముగా సామాన్యీకరణ(Generalization) చేయాలని ప్రయత్నిస్తామో అప్పుడే గొడవలు ప్రారంభమవుతాయి. బ్లాగు అనేది వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకొనే వేదిక, సమాచారాలు ఇచ్చిపుచ్చుకొనే మాధ్యమము అని అనుకొంటున్నాను.

మన బ్లాగుల ప్రథమలక్ష్యము అంతర్జాలములో "తెలుగు వైభవము" అనుకొంటున్నాను. కాని ఈ లక్ష్యము ఉన్నదని ఇప్పుడు కొత్తగా బ్లాగులు వ్రాయడం మొదలుపెడుతున్న వారికి ఎంతమందికి తెలుసు? అసలు ఇలాంటి లక్ష్యము అంటూ ఒకటుందని వారికి తెలుసా? అలా తెలియకపోతే అది వారి తప్పిదము కాదు. సంవత్సరాలుగా బ్లాగులు వ్రాస్తున్న మనది.

ఈ మధ్య నిజముగా జరిగిన ఒక సంఘటన ఒకటి చెప్తాను. 10 రోజుల క్రితం నా స్నేహితుడికి కంప్యూటర్లో తెలుగు వ్రాయవచ్చని, తెలుగులో ఉత్తరాలు పంపుకోవచ్చని , తెలుగులో మన విషయాలు వ్రాసుకోవచ్చని చెప్తే అతను నమ్మలేదు. ఆ అబ్బాయి 10వ తరగతి వరకే చదువుకొన్నాడు. వాడికి కంప్యూటర్ గురించి కొద్దిగా జ్ఞానం ఉంది. సరే అని ఇంటర్నెట్ సెంటరుకు వెళ్ళి మన బ్లాగులు చూపించాను. కాని దురదృష్టము ఏమంటే అతను బ్లాగులలో మన వాగ్వివాదాలు కూడా చూసాడు. అప్పుడు వాడు నాతో అన్న మాట "ఏరా స్వామీ! ఇదేదో బాగుందే. మనకు కోపం వస్తే మొహాన కాకుండా ఇలా వ్రాసుకొంటూ తిట్టుకోవచ్చు" అన్నాడు. వాడు తెలుసుకొన్న నీతి ఇది.
తర్వాత ఒక వారం రోజులు వాడికి కంప్యూటర్లో తెలుగు ఎలా ఉపయోగించవచ్చో నేర్పించాను. త్వరలో వాడు కూడా ఒక బ్లాగు వ్రాయాలని అనుకొంటున్నాడు. అది వేరే సంగతి.

ఇక అసలు విషయానికి వస్తే కొత్తగా బ్లాగులు వ్రాస్తున్నవారు,వ్రాయాలనుకొంటున్నవారు ఇలాంటి వాగ్వివాదాలు,అసభ్యకర వ్యాఖ్యలు చూస్తే ఏమనుకొంటారు?

ఒకరిపై కోపం ఉంటే ఆ వ్యక్తి ఉన్న వ్యవస్థపైనే లేక వర్గంపైనే శత్రుత్వం పెంచుకోవడం సమంజసం కాదు. ఉదాహరణకు ఒక అమ్మాయి మోసం చేసిందని ఆడజాతి పైనే కక్ష్య పెంచుకోవడం, ఎవరో కొందరు అబ్బాయిలు అసభ్యముగా ప్రవర్తిస్తున్నారని మగవారంటేనే అసహ్యం పెంచుకోవడం లాంటివి. ఇలాంటివి బ్లాగులలో చాలా కనపడుతున్నాయి.ఇలా చేయడం వలన ఎదుటివారికి వచ్చే నష్టమంటూ చాలాచాలా తక్కువ. ఇలా చేసేవారికే మానసికముగా బాధలు, మానసిక వ్యాధులు ఎక్కువై తద్వారా ఆరోగ్యాలు చెడిపోవడం వంటి పరిణామాలు జరుగుతాయి. నిద్ర కూడా సరిగా పట్టదు.

చివరగా నేను చెప్పదలుచుకొన్నదేమంటే బ్లాగులలో అసభ్యకర టపాలు, అసభ్య వ్యాఖ్యలు వ్రాయడం, ఒకరి బ్లాగుకే పోటీగా ఇంకో బ్లాగు మొదలుపెట్టడం లాంటివి మానుకొందాం.
చర్చించుకొందాం కాని వాదనలు,వ్యక్తిగత విమర్శలు వద్దు.






Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు