తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Sunday, August 17, 2008

శ్రీరామకృష్ణ పరమహంస

శ్రీరామకృష్ణ పరమహంస గారు అంటే తెలియని ఆస్తిక భారతీయులు ఎవరూ ఉండరంటే అతిశయోక్తికాదు.భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వామివివేకానంద వెనుకగల కర్త,కర్మ,క్రియ అంతా శ్రీరామకృష్ణులే.

జననము మరియు బాల్యము
శ్రీరామకృష్ణ పరమహంస గారు క్రీ.శ 1836,ఫిబ్రవరి 18 న పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్,చంద్రమణిదేవి.వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు.రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు.బాల్యం నుండే ఇతనికి లలితకళలు,చిత్రలేఖనము లో గల ప్రవేశము వలన వారి గ్రామములో ఇతనికి మంచిపేరు ఉండేది.ఐనా ఇతనికి పాఠశాల విద్య అంటే ఏహ్య భావము కలిగిఉండేవాడు.దానివలన చదువు అబ్బలేదు.పూరీకి వెళ్ళు సాధువులు వీరి గ్రామము గుండా వెళ్ళేవారు.వారిని సేవించేవాడు.
ఉపనయనం తర్వాత చిన్నప్పుడు ఒక దళిత మహిళకు ఇచ్చిన మాటప్రకారం బంధువులు వారిస్తున్నా మొదటి భిక్షకు వెళ్ళి స్వీకరించాడు.
రానురాను వీరి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారటంతో వీరి అన్నగారైన రాంకుమార్ గారు కలకత్తాలో ఒక సంస్కృత పాఠశాలను నడిపేవారు.తర్వాత ఒక అంత్యకులంలో జన్మించిన రాణిరాస్మణి దక్షిణేశ్వరంలో నిర్మించిన కాళికాలయంలో పూజారిగా నియమితుడయ్యాడు.

పూజారిగా
మొదట తిరస్కరించినా తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణులు పూజలో సేవచేసేవాడు.గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తాఅని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.కాలక్రమంలో తీవ్ర భక్తిభావంలో నిమగ్నమయ్యి రేయింబవల్లు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు.ఒకనాడు అమ్మవారి దర్శనము పొందాడు.అప్పటి నుండి నిరంతరమూ అమ్మవారి దర్శనభాగ్యం పొందేవాడు.నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు.

వీరి గురువులు మరియు సాధనలు
కాలక్రమంలో తోతాపురి అను నాగాసాంప్రదాయపు సాధువు వీరికి అద్వైతజ్ఞానం ఉపదేశించారు.వీరి గురువుగారు చిన్నప్పటినుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధిస్థితిని రామకృష్ణులు కేవలం మూడు రోజులలోనే పొందారు.తర్వాత భైరవీబ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంలో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు.ఈ విధంగా భగవత్,ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం,క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశాం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు.

వివాహము
వీరు భగవత్ధ్యాసలో ఉండడాన్ని పిచ్చితనంగా భావించిన వీరి తల్లి వీరికి వివాహము చేయ సంకల్పించింది.రామకృష్ణులే తమకొరకు ఒక అమ్మాయి సిద్దంగా ఉన్నదని ఆమె పేరు శారదాదేవి అని చెప్పి శారదాదేవిని పెళ్ళాడారు.ఆమెను సాక్షాత్ కాళికాదేవి లా భావించి పూజించారు.ఆమెను కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు.

గురువుగా
తన అనుభవాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి తగిన వ్యక్తుల కొరకు వీరు నిరీక్షిస్తుండగా మకరందముగ్రోలడానికి వచ్చు తుమ్మెదలలాగా శిష్యౌలు రావడం ప్రారంభించారు.వీరికి ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ వీరిపేరు ప్రపంచ ప్రఖ్యాతి పొందడానికి దోహదం చేసినది వివేకానందులు.వీరి పరిచయం విచిత్రంగా జరిగినది.
అప్పటికి వివేకానందులు నిజంగా భగవత్ అనుభవమ్ పొందిన వారిని అన్వేషిస్తూ ఎందరినో కలిసి నిరాశకు లోనై చివరికి రామకృష్ణులను కలిశారు."మహాత్మా మీరు భగవంతున్ని చూసారా?" అని ప్రశ్నించి సానుకూల సమాధానం పొందాడు.రామకృష్ణులు కేవలం స్పర్శతో ఆద్యాత్మిక అనుభవాలను ప్రసాదించేవాడు.

రామకృష్ణులు ప్రపంచానికి అందించిన శిష్యులు:
స్వామి వివేకానంద,స్వామి బ్రహ్మానంద,స్వామి ప్రేమానంద,స్వామి శివానంద,స్వామి త్రిగుణాతీతానంద,స్వామి అభేదానంద,స్వామి తురీయాతీతానంద,స్వామి శారదానంద,స్వామి అద్భుతానంద,స్వామి అద్వైతానంద,స్వామి సుభోదానంద,స్వామి విజ్ఞానానంద,స్వామి రామకృష్ణానంద,స్వామి అఖండానంద,స్వామి యోగానంద,స్వామి నిర్గుణానంద. వీరి ద్వారా రామకృష్ణమిషన్ స్థాపించబడి నేటికీ ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది.
వీరు సన్యాస శిష్యులు.గృహస్థ శిష్యులలో నాగమహాశయులు,పూర్ణుడు,గిరీష్ ఘోష్ మొదలగువారు ప్రముఖులు.

వీరి ప్రముఖ భోదలు
#అన్నిమతాల సారాంశం ఒక్కటే.
#కామకాంచనాలనుండి విడివడితే భగవంతున్ని పొందవచ్చు.
#మానవసేవే మాధవసేవ
#ఒక గమ్యానికి ఎన్నోమార్గాలున్నట్లే భగవంతున్ని చేరడానికి మతాలు కూడా మార్గాలే.
అలాగే స్వామీ వివేకానందుని భోధనలలో చాలా భాగం రామకృష్ణులవే.
అంత్యదశ
వీరు కాలక్రమంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు.తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశిపూర్ కు మార్చారు. అప్పుడు శిష్యులు అందరూ ఎంతో సేవచేశారు.చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ స్వామి వివేకానందునికి ధారపోసారు.
చివరికి వీరు 1886,ఆగష్టు 16 న భగవంతునియందు లయించారు.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు